బాలీవుడ్‌కి ముంబాయి అండర్ వరల్డ్‌తో సత్సంబంధాలు ఉన్నాయన్న విషయం ఎన్నో సంవత్సరాల క్రితమే వెలుగులోకి వచ్చింది. దానికి తగ్గట్టుగానే ముంబాయిలో జరిగిన కొన్ని ఘటనలు అవి నిజమేనని ప్రూవ్ చేశాయి. గ్యాంగ్‌స్టర్లు, డాన్లు బాలీవుడ్‌పై అజమాయిషీ చెలాయించడం అక్కడ సర్వసాధారణం అయిపోయింది. ఇటీవలి కాలంలో దీనికి సంబంధించి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌పైనే ఎక్కువ వార్తలు వస్తున్నాయి. గతంలో సల్మాన్‌కి ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చాయి. గత కొన్నేళ్లుగా సల్మాన్ కుటుంబం భయం గుప్పిట్లోనే ఉంది. ఇప్పటికే చాలా సార్లు తనను, తన కుటుంబాన్ని జోధ్‌పూర్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ చంపుతానని బెదిరించడంతో సల్మాన్ క్షణక్షణం భయంతో గడుపుతున్నారు. అతను ఎక్కడికి వెళ్లినా చుట్టూ సెక్యూరిటీ ఉండాల్సిందే. అలాగే ఎప్పుడూ బుల్లెట్ ప్రూఫ్ కారులోనే ప్రయాణిస్తాడు సల్మాన్.
ఆమధ్య సల్మాన్ ఖాన్ ఇంటిపై కొందరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆ గ్యాంగ్‌స్టర్ అనుచరులను అరెస్ట్ చేశారు. సల్మాన్‌ఖాన్‌ను హత మార్చేందుకు ఆ గ్యాంగ్‌స్టర్ అనుచరులు కుట్ర చేశారని పోలీసులు గుర్తించారు. దీన్ని ఛేదించడంతో సల్మాన్ కుటుంబంతోపాటు అభిమానులు కూడా రిలాక్స్ అయ్యారు. దీనికి సంబంధించిన విచారణ ఇంకా జరుగుతోంది. ఈ సమయంలో మరో వార్త అందర్నీ షాక్‌కి గురి చేసింది. మార్నింగ్ వాక్‌కి వెళ్లిన సల్మాన్ ఖాన్ తండ్రి సలీమ్‌ఖాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు తన దగ్గరకు వచ్చి తాము లారెన్స్ బిష్టోయ్ మనుషులమని చెబుతూ ‘బిష్ణోయ్‌ని మీ దగ్గరికి పంపమంటారా?’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ విషయాన్ని సలీమ్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. బాంద్రా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఆ వ్యక్తులను అరెస్ట్ చేశారు. నిందితులపై నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 352(2), 292, 3(5) బిఎన్‌ఎస్ సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వాకింగ్ చేస్తుండగా సలీమ్‌కి బెదిరింపులు రావడం అది రెండోసారి. మొదటిసారి అతన్ని హెచ్చరిస్తూ ఒక లెటర్‌ను పార్క్‌లో వదిలి వెళ్లారు దుండగులు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు అది లారెన్స్ బిష్ణోయ్ పనేనని తేల్చారు. తాజాగా జరిగిన ఘటనతో సల్మాన్‌ఖాన్ కుటుంబం ఎంతో ఆందోళనలో ఉంది. మరి ఆ గ్యాంగ్‌స్టర్ నుంచి ఈ కుటుంబం ఎలా బయటపడుతుందో చూడాలి.